Thursday, August 17, 2017

ముల్కనూర్‌కు మహిళా సంఘల బలం - Dairy Farming in India

ముల్కనూర్‌కు మహిళా సంఘల బలం



చేతితో విత్తనాలేసి బళ్లకు తిండి గింజలు ఎత్తే అన్నదాతే సమాజాభ్యున్నతికి, నాగరికత వికాసానికి జీవన రేఖ. ఇంతటి ఉత్కృష్టమైన వ్యవసాయ వృత్తి ద్వారా సమాజానికి ఆకలి తీర్చే అన్నదాతలు.. దురదృష్టవశాత్తూ కష్టాల కన్నీళ్లతో కడుపునింపుకోవాల్సిన దుస్థితి దేశమంతా అలముకుంది. అయితే, ఒంటరిగా ఉన్నప్పుడు వెంటాడిన బలహీనత.. నలుగురూ చేతులు కలిపినప్పుడు బలిష్ట శక్తిగా మారుతుంది. ఈ లక్ష్యంతోనే వ్యవసాయోత్పత్తిదారులను సంఘటిత పరిచేందుకు చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పరస్పర సహాయ సహకార సంఘాలుగా, ప్రొడ్యూసర్‌ కంపెనీలు(ఎఫ్‌.పి.సి.లు)గా ఏర్పడితే.. సాగు ఖర్చులు తగ్గించుకోవడం, తమ ఉత్పత్తులను తామే నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటూ నికరాదాయాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుందన్నది భావన. భావన మంచిదేఅయినా.. విధాన లోపం వల్ల సహకార ఫలాలు రైతులకు బాసటగా నిలవలేకపోతున్నాయి. వ్యవసాయేతర స్థిరాస్తులు తనఖా పెడితేనే రుణాలిస్తామని బ్యాంకులు భీష్మిస్తున్నాయి. అందువల్లనే పట్టణ ప్రాంతాల్లోని బలమైన సొసైటీలే రుణాల్లో సింహభాగాన్ని తన్నుకుపోతున్నాయన్న విమర్శ ఉంది. గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల సహకార సంఘాలకు మాత్రం కష్టాలతో కాపురం తప్పటం లేదు!

♦ మిల్క్‌నూర్‌ డెయిరీ
♦ 
మహిళా రైతులకు ఆదాయ భద్రత!
♦ 
ముల్కనూర్‌ మహిళా రైతుల సహకార డెయిరీ దేశానికే ఆదర్శం
♦ 20
వేల మంది సభ్యులు.. 50 వేల పాడి పశువులు
♦ 
ఏటా రూ. 90 కోట్ల లావాదేవీల స్థాయికి దినదినాభివృద్ధి

తెలంగాణ మారుమూల పల్లెల్లో పుట్టిపెరిగిన ముల్కనూరు ప్రాంత మహిళా రైతులు కవ్వమాడిన చోట కరువు ఉండదుఅన్న పెద్దల మాటను వంట పట్టించుకున్నారు. వారు డిగ్రీలు చదువుకోలేదు, కానీ అక్షరాలు నేర్చుకున్నారు. చేయీ చేయీ కలిపి.. రూపాయికి రూపాయి జమ చేసి పొదుపు అలవాటు చేసుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు తాము కూడబెట్టుకున్న పొదుపు సొమ్ముతోనే ఏకంగా మహిళా డెయిరీనే నెలకొల్పి.. రూ. కోట్ల సంపదను సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత రూ. 90 కోట్ల వార్షిక లావాదేవీలు నిర్వహించే స్థితికి ఎదిగారు. తమ చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏడాది పొడవునా ఆదాయ భద్రతను చేకూర్చే వెలుగుబాట చూపారు. ముల్కనూరు రైతు మహిళలు చూపిన సహకార స్ఫూర్తి, పట్టుదల, కృషి, దృఢ సంకల్పానికి ఇవాళ దేశం యావత్తూ జేజేలు పలుకుతోంది...


కృషితో నాస్తి దుర్భిక్షంఅనే సూక్తిని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ ప్రాంత మహిళా రైతుల సహకార స్ఫూర్తిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వరస కరువులతో పంటలు ఎండిపోతూ... పెట్టుబడులు కూడా తిరిగి రాని దైన్యం నుంచి గట్టెక్కేందుకు మహిళలు ఇంటికి ఒకటి, రెండు పాడి పశువులను పెంచుతూ పాల ఉత్పత్తితో ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. ముల్కనూర్‌ పేరును మిల్క్‌నూర్‌గా మార్చారు. దేశంలోనే ప్రప్రథమంగా ముల్కనూర్‌లో మహిళల భాగస్వామ్యంతో డెయిరీని నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం విశేషం.

1999
లో ముల్కనూరు మండలంలోని ముస్తఫాపూర్‌లో 20 మంది మహిళలు పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో ఆ గ్రామం, మండలంలోని మహిళలంతా పొదుపు ఉద్యమంలో చేరారు. మహిళా సంఘాలు చిన్నపాటి బ్యాంక్‌లుగా మారాయి. అలా కూడబెట్టిన సొంత సొమ్మును దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా పెట్టుబడి పెట్టడం ఎలా? అని ఆలోచిస్తూ మహిళా పొదుపు సంఘాల బాధ్యులు డెయిరీని నెలకొల్పాలని నిర్ణయించారు. రైతుల సహకారోద్యమానికి ముల్కనూరు అప్పటికే పెట్టింది పేరు. ముల్కనూరు రైతు సహకారోద్యమ నేత విశ్వనాథరెడ్డి చూపిన సహకారం, సేవలక్ష్యాల వెలుగులో మహిళలు సంఘటితంగా ముందుకు నడిచారు.

జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తోడ్పాటుతో కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌(సి.డి.ఎఫ్‌.) మార్కెట్‌ సర్వే చేసి, ముల్కనూరు ప్రాంతంలో డెయిరీ ఆవశ్యకత ఉందని నిర్ధారించింది. దేశంలోనే మొట్టమొదటిదైన ముల్కనూరు మహిళా పరస్పర సహాయ సహకార డెయిరీఆ విధంగా రూపుదాల్చింది. స్వకృషి బ్రాండ్‌ పేరిట పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ, దినదినాభివృద్ధి సాధిస్తూ మహిళా సహకార స్ఫూర్తిని దశదిశలా చాటుతున్నారు. వీరి కృషికి మెచ్చి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ తదితర ప్రముఖులు కితాబునిచ్చారు.
గేదె పాలకు రూ.41.30.. ఆవు పాలకు రూ. 26.87..
ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాలోని 72 గ్రామాల్లో 6 వేల మంది సభ్యులు రూ. 7 కోట్ల పెట్టుబడితో మండలంలోని ముల్కనూర్‌లో ఆగస్టు 17, 2002న డెయిరీ ప్రారంభమయింది. నేడు వరంగల్‌ అర్బన్, కరీంనగర్, సిద్ధిపేట, జనగామ జిల్లాల్లోని 140 గ్రామాల్లో 40వేలకు పైచిలుకు పాడి గేదెలు, ఆవులు ఉన్నాయి. పాల సంఘాల ద్వారా రోజూ 40 వేల లీటర్లకు పైగా సేకరిస్తున్నారు. గేదె పాలకు అత్యధికంగా సగటున లీటరుకు రూ.41.30, ఆవు పాలకు లీటర్‌కు రూ. 26.87 చెల్లిస్తున్నారు. ఇక అన్ని గ్రామాల్లోని పాల సంఘాలు కంప్యూటీకరించారు. 15 రోజులకోసారి రైతులకు నగదు చెల్లిస్తున్నారు.

ఏటా రూ. 90 కోట్ల వ్యాపారం
ముల్కనూర్‌ డెయిరీ స్వకృషిబ్రాండ్‌ పేరుతో సుమారు 10 తెలంగాణ జిల్లాల్లో పాలు, పెరుగు, నెయ్యి, లస్సీ, స్వీట్‌ లస్సీ, మజ్జిగ, దూద్‌పేడ్, స్వీట్లు విక్రయిస్తుంది. 20 వేల సభ్యులతో ఏటా లాభాల బాటలో పయనిస్తున్నది. డెయిరీ పాలకవర్గ సభ్యులు 12 మంది ప్రతి నెలా సమావేశమై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటారు. డెయిరీ సిబ్బంది, పాల సంఘాల కార్యదర్శులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తారని జనరల్‌ మేనేజర్‌ మార్పాటి భాస్కర్‌రెడ్డి (99088 55114) తెలిపారు.

నాణ్యతలో రాజీ లేకుండా శుభ్రమైన, స్వచ్ఛమైన పాలు, పాలపదార్థాలను విక్రయిస్తున్నామని, రూ. 90 కోట్ల వార్షిక ఆర్థిక లావాదేవీలతో లాభాల బాటలో పయనిస్తున్నామని ఆయన అన్నారు. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నాలుగు సార్లు ఐఎస్‌వో గుర్తింపు లభించింది. 2012 డిసెంబర్‌ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డును డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల అందుకున్నారు. వ్యవసాయంలో అధిక పని గంటలు శ్రమించే మహిళలు స్వయంగా డెయిరీని నెలకొల్పి అభ్యున్నతికి పాటుపడటం చాలా గొప్ప సంగతి.

ఒక ఆవుకు రూ. 22,500 మిగులుతయి!
ఎకరం భూమిలో పత్తి పంట పెడితే కాలం మంచిగ అయి పంట పండితే రూ. 30 వేలు వత్తయి. పెట్టుబడి పోను రూ. 15 వేలు లాభం ఉంటది. వర్షాలు లేకపోతే పంట పండది. అప్పులే మిగులుతాయి. ఒక ఆవును పెంచుకుంటే ఖర్చులు పోను 10 నెలల్లో రూ. 22,500 మిగులుతయి. మాకు 2 ఆవులున్నాయి. రోజూ 4 లీటర్ల పాలు కేంద్రానికి పోస్తా. నెలకు రూ. 3 వేల పాల బిల్లు ఎత్తుకుంటా. ఈ డబ్బుతోనే మా కుటుంబం గడుస్తున్నది.

0 comments:

Post a Comment